జనతా గ్యారేజ్.. బెస్ట్ సర్వీసింగ్ సెంటర్

Janatha-Garage
చిత్రం: జనతా గ్యారేజ్
నటీనటులు: ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, రెహమాన్, సురేష్
దర్శకత్వం: కొరటాల శివ
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత : నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్, సివి మోహన్

టెంపర్, నాన్నకు ప్రేమతో హిట్స్ తో ఫాంలో ఉన్న ఎన్టీఆర్ హ్యాట్రిక్ రేసులో వచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను జనతా గ్యారేజ్ అందుకుందా..? కొరటాల శివ, ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్ సాధించారా..? అన్నది చూద్దాం..

స్టోరీ:
మెకానిక్ గా పనిచేస్తూ తన తమ్ముడు(రెహమాన్)ని ఉన్నత చదువులు చదివిస్తాడు సత్యం(మోహన్ లాల్). చదువు అయిపోయాక తమ్ముడు సిటీలో మంచి ఉద్యోగం సంపాదించి అన్నను కూడా తన దగ్గరుకు తీసుకొచ్చి జనతా గ్యారేజ్ పెట్టిస్తాడు. తన పనితనంతో గ్యారేజ్ కు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెస్తాడు సత్యం. కష్టం వచ్చిందని తన గ్యారేజ్ దగ్గరికి వచ్చి ఎవరు ఎలాంటి సాయం అడిగినా సాయం చేయడానికి రెడీ అయిపోతాడు. అలా తన దగ్గరికి వచ్చిన ఓ కస్టమర్ కు సాయం చేస్తాడు. అతని కూతురిని రేప్ చేసి చంపేసిన వారిని చంపేస్తాడు. ఈ ప్రయాణంలోనే సత్యం శత్రువులు అతని తమ్ముడిని, తమ్ముడి భార్యను కూడా చంపేస్తారు.

మరోవైపు ముంబైలో మొక్కలంటే ప్రాణం ఇచ్చే యువకుడు ఆనంద్(ఎన్టీఆర్). ఎన్విరాన్ మెంటల్ సైన్స్ చదువుతూ.. మొక్కల్ని ప్రేమిస్తు ఉంటాడు. అమ్మానాన్నా అన్నీ ఆనంద్ కు అత్త, మామయ్యలే. ఇక పర్యావరణానికి హాని కలిగిస్తున్నారంటూ ఆనందర్ ఎమ్మెల్యేపై కేసు పెట్టి అతని పదవి పోయేలా చేస్తాడు. దీంతో ఆ ఎమ్మెల్యేకు భయపడిన ఆనంద్ అత్తా, మామ అతన్ని హైదరాబాద్ కు పంపిస్తారు. ఆనందర్ హైదరాబాద్ వచ్చిన వెంటనే పొల్యూట్ చేస్తున్న ఓ క్వారీ ఓనర్ ను కొడతాడు. అతనే సత్యం కొడుకు. అక్కడి నుంచి సత్యం గ్యారేజ్ లోకి ఎంటర్ అవుతాడు ఆనంద్. ఆ గ్యారేజ్ కూ ఆనంద్ కు ఉన్న సంబందం ఏంటి, న్యాయం కోసం పోరాడుతూ సత్యం చేసిన త్యాగం ఏంటీ అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ :
బలమైన కథలతో వరస హిట్లు కొడుతున్న కొరటాల శివ ఈ సినిమాలోనూ తన మార్క్ చూపించాడు. మోహన్ లాల్, ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్టులతో జనతా గ్యారేజ్ కు భారీ అంచనాలు పెంచాడు. ఆ అంఛనాలను అందుకోవడంలో సక్సెస్ కూడా అయ్యాడు. హైదరాబాద్‌లో గ్యారేజ్ నడుపుకునే సత్యంకూ, ముంబైలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చదువుకుంటోన్న ఆనంద్ కు బంధాన్ని చూపించే సీన్స్ అద్భుతంగా తెరకెక్కించాడు. రాజీవ్ కనకాల ఎపిసోడ్, అజయ్‌‌ని చంపే సీన్స్ ఈ రెంటినీ సినిమాకు జీవం ఇచ్చేలా రాసుకున్నారు. ఆయా సీన్స్ లో నటీనటుల నటనకు చప్పట్లు కొట్టకుండా ఉండలేం. హీరోయిన్ల విషయానికి వస్తే పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. ప్రేమకు పెద్దగా సినిమాలో ఇంపార్టెన్స్ లేదు. ఇక సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన వారంతా తమ తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ అద్భుత నటన పండించారు. ఎన్టీఆర్, మోహన్ లాల్ ల మధ్య వచ్చే సీన్స్ హై ఎమోషన్ ను క్రియేట్ చేశాయి. ఐటమ్ సాంగ్ లో కాజల్ షాక్ ఇచ్చింది. మొత్తంగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అభిమానులకు కావాల్సిన అన్ని రిపేర్లు చేసి వారికి ఫుల్ ఖుషీ ఇచ్చింది.

ప్లస్ పాయింట్స్: మోహన్ లాల్, ఎన్టీఆర్
పాటలు, సినిమాటోగ్రఫీ, ఫైట్స్

మైనస్ పాయింట్స్: కథ, కథనం, సెకండ్ హాఫ్

చివరిగా..: జనతా గ్యారేజ్.. బెస్ట్ సర్వీసింగ్ సెంటర్