Why We Celebrate RamaNavami ?

హిందువులు ఎంతో ఆధ్యాత్మికంగా, సంస్కృతీ – సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పండుగలలో శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైంది. శ్రీరామనవమి రోజు ఎంతో వైభవంగా పూజాకార్యక్రమాలను నిర్వహించుకుని, సీతారాముల కల్యాణం చేస్తారు. అలాగే శ్రీరాముడి జన్మదినం కూడా శ్రీరామనవమి రోజే కాబట్టి భక్తులు ఎంతో ఘనంగా ఈ పండుగను చేస్తారు. శ్రీరామనవమి చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష నవమినే శ్రీరామనవమిగా పండుగ చేసుకుంటారు.విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు.. పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. దీనినే అభిజీత్ ముహూర్తం అని కూడా అంటారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. శ్రీరాముడు క్రీస్తుపూర్వం 5114 జనవరి 10వ తేదీన, త్రేతాయుగంలో జన్మించి వుంటాడని అంచనా వేశారు. దశరథ మహారాజు, కౌసల్య దంపతులకు శ్రీరామచంద్రుడు జన్మించాడు. విష్ణుమూర్తి ఏడవ అవతారం అయిన శ్రీరాముడు.. అధర్మాన్ని అంతం చేసి, ధర్మాన్ని సంరక్షించేందుకు అవతరించాడు.కొందరు శ్రీరామనవమి పండుగను దసరా నవరాత్రులలాగా ఎంతో ఆహ్లాదకరంగా తొమ్మిదిరోజులపాటు చేసుకుంటారు. రామునికి సంబంధించిన అన్ని ఆలయాలలో శ్రీరామనవమిని తొమ్మదిరోజులవరకు (నవరాత్రులు) ఉత్సవాలు జరుపుకుంటారు కాబట్టి ఈ పండుగను ‘‘శ్రీరామనవమి’’ అని అంటారు.
          శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని.. కొన్ని ప్రాంతాలలో హోలీని తలపించే వసంతోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. శ్రీరామనవమి పండుగరోజు రథయాత్రను నిర్వహిస్తారు. ఈ పండుగరోజు కొందరు భక్తులు ఏమీ సేవించకుండా ఉపవాసం వుంటే.. మరికొంతమంది పానకము, పండ్లను సేవిస్తూ.. ఉపవాసం వుంటారు.శ్రీరామనవమి పండుగరోజు అన్ని ఆలయాలలో సీతారాముల విగ్రహాలను అందంగా అలంకరించి, కల్యాణం జరుపుతారు. కల్యాణం ముగిసిన తరువాత భక్తజన సందోహం అనుసరించి.. రాగా ఉత్సవ మూర్తులను వీధుల్లో ఊరేగిస్తారు. రామునికి పరమభక్తుడైన హనుమంతుడిని కూడా ఈ పండుగరోజు ఆరాధిస్తారు.ఈ పండుగరోజు రామాయణాన్ని పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. అలాగే నిత్యం రామనామ స్మరణం చేస్తే.. చేసిన పాపాలు తొలగిపోయి, సర్వసౌఖ్యాలు కలుగుతాయని చెబుతున్నారు. మనసు కూడా ప్రశాంతంగా, హాయిగా వుంటుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు. శ్రీరామనవమి పర్వదినం రోజు.. ‘‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ; సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరాననో’’ అనే మంత్రాన్ని తొమ్మిదిసార్లు జపిస్తే.. కష్టనష్టాలు తొలగిపోయి.. సకల సంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.

తలంబ్రాలు : ఇంట్లో వున్న సభ్యులందరూ స్నానాలు చేసుకున్న తరువాత వడ్లు తీసుకుని, ‘శ్రీరామా’ అని గోటితో వలచి.. ఆ బియ్యాన్ని ఒక పాత్రలో పోసుకోవాలి. ఇలా తయారుచేసిన బియ్యాన్ని శ్రీరామనవమి రోజు ఉదయాన్నే తీసుకువెళ్లి.. ఊరిలో నిర్వహించుకున్న సీతారాముల కల్యాణ మండపంలో తలంబ్రాలు నిమిత్తం అక్కడున్న పూజారులకు అందజేయాలి. ఇలా చేయడం వల్ల దనవృద్ధి చెంది, పరంధాముని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇంట్లో వున్న దోషాలు తొలగిపోయి, ప్రశాంత వాతావరణంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటుంది.

1,031 total views, 0 views today