దంగల్ రివ్యూ

dangal_review

సినిమా: దంగల్
నటీనటులు: అమీర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వాసిం
దర్శకత్వం: నితీష్ తివారీ
బ్యానర్ : వాల్ట్ డిస్నీ పిక్చర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, యుటివి మోషన్ పిక్చర్స్
సంగీతం: ప్రీతమ్

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘దంగల్’. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. రెజ్లింగ్ యోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కి విడుదలకు ముందే భారీ అంఛనాలను పెంచేసింది. విడుదలకు మూడు రోజుల ముందే అమీర్ ఖాన్ తన సన్నిహితులకు ప్రివ్యూ కూడా వేసి చూపించారు. అది చూసిన వారంతా అమీర్ నటనపై ప్రశంసలు కురిపించారు. అమీర్ ఎప్పటిలానే తన క్యారెక్టర్ లో భిన్నమైన పాత్రలు పోషించారని, దర్శకుని ప్రతిభ బాగుందంటూ సచిన్ టెండూల్కర్, షబానా అజ్మీ, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ అమీర్ నటనకు కన్నీళ్లు పెట్టాల్సిందేనంటూ ఆకాశానికి ఎత్తేశారు. మరి సెలబ్రిటీలకు అద్భుతం అనిపించిన ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందో.. చూసేద్దాం…

దంగల్ స్టోరీ…
జాతీయ స్థాయి రెజ్లింగ్ ఆటగాడు మహావీర్ సింగ్ పోగట్(అమీర్ ఖాన్) తన కుటుంబం కోసం తనకు ప్రాణమైన రెజ్లింగ్ ను వదిలేస్తాడు. తన కలను తన కొడుకు ద్వారా అయినా నెరవేర్చుకోవాలని ఆశపడతాడు. కానీ భార్య (సాక్షి తన్వార్) నలుగురు కూతుళ్లకు జన్మనిస్తుంది. దీంతో పూర్తిగా తన కలను మర్చిపోయి సాధారణ జీవితంలో మునిగిపోతాడు.

అయితే ఓ రోజు మహావీర్ పెద్ద కూతుళ్లు గీతా(జైరా వాసిం), బబిత(సుహానీ భట్నాగర్) కొందరు రౌడీలతో గొడవ పడి వారికి దేహశుద్ధి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న మహావీర్ ఆలోచనలో పడతాడు. కొడుకుల కన్నా కూతుళ్లు ఏమీ తక్కువ కాదని వారికే రెజ్లింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తాడు.

ఆ ఇద్దరు అమ్మాయిలు శారీరకంగా ఎదురయ్యే సమస్యలతో పాటు, సమాజం లో ఉన్న చిన్నచూపుని కూడా ఎలా అధిగమించారు? తమ తండ్రి కలను ఎలా నిజం చేశారన్నది తెరపై చూడాల్సిందే.

పాజిటివ్ పాయింట్స్…
సినిమా మొదటి హాఫ్ సూపర్బ్. చిన్న పొరపాటు కూడా వెతకలేనంత అద్భుతంగా తెరకెక్కింది. తండ్రీ, కూతుళ్ల మధ్య బంధం, గీతా, బబిత తో మహావీర్ ఎమోషనల్ బాండింగ్ చాలా బాగా చూపించాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త డ్రమాటిక్‌ టర్న్ తీసుకుంటుంది. ఇద్దరు అమ్మాయిలు పెరిగే కొద్ది ఎదురయ్యే సమస్యలు, వాటిని వారు నేర్పుగా పరిష్కరించుకునే తీరు ఎంతో రియలిస్టిగ్‌గా ఉంటుంది. గీత టోర్నమెంట్స్‌లో పాల్గొనడం, ఎదుర్కొనే సవాళ్లతో సెకండ్ హాఫ్ పూర్తిగా రెజ్లింగ్‌తో నిండిపోయింది.

పదునైన డైలాగ్స్, అమీర్ ఖాన్ శరీరంలో మార్పు సినిమాకు హైలెట్. ఓ నిజమైన రెజ్లర్‌గా అమీర్ ఖాన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇటీవలి కాలంలో అమీర్ ఖాన్ చేసిన సినిమాల్లోని పాత్రలకన్నా ఇది బెస్ట్ అనిపించేలా రెండు భిన్న పాత్రలు పోషించాడు.

మహావీర్ భార్యగా సాక్షి తన్వార్ పూర్తి న్యాయం చేసింది. జైరా వాసిం, గీతా అద్భుతం అనిపించారు. ఓ రెజ్లర్‌గా గీత తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగిలిన వారు కూడా మహావీర్ జీవిత గాథలో తమ పాత్రల పరిధి మేరకు ఒదిగిపోయారు.

దర్శకుడు నితీష్ తివారీ తన ప్రయోగానికి పూర్తి న్యాయం చేశారు. స్క్రిప్టు ఎక్స్‌ట్రార్డినరీ గా ఉంది. ప్రీతం సంగీతం సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. దంగల్ టైటిల్ కి తగిన విధంగా సినిమా మొత్తం అదే స్థాయిలో ఎనర్జీని క్యారీ చేసింది.

నెగెటివ్..
క్లైమాక్స్ లో ట్విస్ట్ సెట్ అవ్వలేదనిపిస్తుంది.

దంగల్ రిజల్ట్: ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసే చిత్రం. అమీర్ ఖాన్ అద్భుత నటనతో ప్రేక్షకుడిని మహావీర్ జీవితంలోకి తీసుకెళ్లిపోయారు. తప్పక చూడాల్సిన చిత్రం.

రేటింగ్: 4/5