ఖైదీ నెంబర్.150 రివ్యూ పైసా వ‌సూల్ మాస్ మెగా స్టార్ మూవీ

చిత్రం: ఖైదీ నెంబర్.150
బ్యాన‌ర్‌: కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు: మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్
 
డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌దర్స్, వేమారెడ్డి, బుర్రా సాయిమాధ‌వ్‌
నిర్మాత‌: రాంచ‌ర‌ణ్
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వివి.వినాయ‌క్‌
 
ప‌దేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. వివి.వినాయ‌క్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం కత్తికి రీమేక్ గా తెర‌కెక్కిన ఖైదీ భారీ అంచ‌నాల మ‌ధ్య బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ చిత్రం అంఛనాలను అందుకుందా, చిరు మరోసారి టాలీవుడ్ లో సంచలనం సృష్టించారా అన్నది చూద్దాం… 
 
ఖైదీనెం.150 కథ… 
కత్తి సినిమా
రాయ‌ల‌సీమ‌ అనంత‌పురం జిల్లాలోని నీరూరు అనే ఊరిలో రైతులు వ్య‌వ‌సాయాన్నే న‌మ్ముకుని జీవిస్తుంటారు. అదే గ్రామంలో భూములను స్వాధీనం చేసుకోవాలని చూసే కొందరికి అగ‌ర్వాల్ (త‌రుణ్ అరోరా)నాయ‌క‌త్వం వ‌హిస్తాడు. రైతుల‌ను ఒక్కొక్కరిగా చంపేస్తూ వారి శ‌వాల వేలిముద్ర‌లు తీసుకుని  భూములను స్వాధీనం చేసుకుంటాడు. ఇదే క్రమంలో గ్రామంలోని ఆరుగురు రైతులు తమ గ్రామం కోసం లైవ్ వీడియో తీయించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. దాంతో నీరూరు రైతుల బాధలు, పోరాటం వెలుగు చూస్తుంది. అదే గ్రామానికి చెందిన శంక‌ర్(చిరంజీవి) రైతుల కోసం పోరాటం చేస్తుంటాడు. గ్రామానికి చెందిన వృద్ధులను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చి, హైకోర్టులో వారి త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు.
 
మరో వైపు క‌త్తి శీను (చిరంజీవి) క‌ల‌క‌త్తా సెంట్ర‌ల్ జైలు నుంచి త‌ప్పించుకుని హైద‌రాబాద్ వ‌స్తాడు. అనుకోని విధంగా ఓ ప్రమాదంలో గాయ‌ప‌డిన శంక‌ర్‌ను చూసి షాక్ అవుతాడు. శంక‌ర్‌ను ఆసుప‌త్రికి తీసుకువెళ్లి అక్కడ త‌న వ‌స్తువుల‌ను పెట్టి తప్పించుకుంటాడు. శీను కోసం వచ్చిన పోలీసులు శంకర్ ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. నీరూరు రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్న తర్వాత మారి వారి కోసం అగ‌ర్వాల్‌తో పోరాటానికి దిగుతాడు. ఈ క్రమంలోనే సుబ్బ‌ల‌క్ష్మి (కాజ‌ల్‌)తో ప్రేమలో పడతాడు. మరి శంకర్ జైలు నుండి బైటికి వచ్చాడా? శీను శంకర్ కు సాయం చేసి రైతుల సమస్యకు పరిష్కారం చూపాడా? ఈ ఇద్దరూ కలిసి నీరూరుకు న్యాయం ఎలా చేస్తారు అన్నదే మిగిలిన స్టోరీ.
 
 
ఖైదీ విశ్లేష‌ణ‌.. 
కత్తి సినిమా సీన్ టు సీన్ అలాగే తెరకెక్కించారు. ఈ చిత్రంలో అదనంగా బ్ర‌హ్మీ కామెడీని కలిపారు. ఫ‌స్టాఫ్‌లో చిరంజీవి, అలీ, బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఇంట‌ర్వెల్ తర్వాత సినిమా స్పీడందుకుంటుంది. మెయిన్ స్టోరీ మొత్తం సెకండాఫ్‌లో కీలక మలుపుతిరుగుతుంది. రైతుల స‌మ‌స్య‌ల కోసం చిరంజీవి వృద్ధుల‌తో క‌లిసి చేసే పోరాటం సీన్స్ చాలా బాగున్నాయి. స్టెప్స్ తో చిరు మరోసారి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేశాడు. ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ సాంగ్‌లో చరణ్ ఎంట్రీ మెగాఫ్యాన్స్‌కు మరో స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌. సినిమా మొత్తంగా చిరంజీవి వన్ మ్యాన్ షో గా సాగింది.  
 
 
న‌టీన‌టుల ప్రతిభ…
ప‌దేళ్ల త‌ర్వాత వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ నటన సూప‌ర్బ్‌. నటనలో, ఎన‌ర్జీ లెవ‌ల్స్‌లో ఏ మాత్రం జోష్ తగ్గలేదని నిరూపించుకున్నారు చిరు. క‌త్తి శ్రీనుగా, శంక‌ర్ గా రెండు పాత్రల్లో వేరియేషన్ చాలా బాగా చూపించారు. యంగ్ హీరోలకు పోటాపోటీగా స్టెప్స్ వేసి ఆకట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్ గ్లామరస్ గా కనిపించింది. పాత్ర కనిపించినంత వరకు చిరుకు సరి జోడిగా కనిపించింది. విలన్ త‌రుణ్ అరోరా స్టైలీష్‌గా కనిపించాడు. ఆలీ, బ్రహ్మానందం తమ పాత్ర పరిధి మేరకు ఎప్పటిలానే మెప్పించే ప్రయత్నం చేశారు. ర‌విబాబు, పోసాని, నాగ‌బాబు కొన్ని సీన్లలో కనిపించి అలరించారు. వినాయ‌క్ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. కత్తి సినిమాను స్క్రీన్ ప్లే నుండి ప్రతి సీన్ జిరాక్స్‌ చేశాడు వినాయక్. 
 
ఫ్ల‌స్ పాయింట్స్ :
స్టోరీ లైన్‌, చిరంజీవి నటన, డ్యాన్స్‌, టెక్నికల్ 
 
ఖైదీ రిజల్ట్: మెగాస్టార్ ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150తో వచ్చి సంక్రాంతిని ముందే తీసుకొచ్చేశారు. మొత్తంగా పైసా వ‌సూల్ మాస్ మెగా స్టార్ మూవీ
రేటింగ్: 4/5