రివ్యూ: మీలో ఎవరు కోటీశ్వరుడు

mek_review-1

తారాగణం : పృథ్వీ, సలోని, నవీన్ చంద్ర, శృతిసోథి, పోసాని కృష్ణమురళి
సంగీతం : డిజె వసంత్
దర్శకత్వం : ఇ.సత్తిబాబు
నిర్మాత : కెకె రాధామోహన్
జానర్ : సెటైరికల్ కామెడీ

కథ :
ప్రశాంత్(నవీన్ చంద్ర) బుద్ధిమంతుడు, కాలేజ్ టాపర్. ఓ రోజు రాత్రి రోడ్డుపై వెళ్తుండగా తాగిన మత్తులో కారును డివైడర్కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఇంటికి తీసుకెళ్లి వదిలిపెడతాడు ప్రశాంత్. తాను తాగిన మత్తులో ఉన్నా ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టడం చూసి ప్రియా ప్రశాంత్ ను ప్రేమిస్తుంది. కానీ ప్రశాంత్ మాత్రం ఆమె ప్రేమను ఒప్పుకోడు. ఎలాగోలా చివరికి అతడు కూడా తనను ప్రేమించేలా చేసుకుంటుంది ప్రియా. కానీ ప్రియ ప్రేమను మిలియనీర్ అయిన ఆమె తండ్రి ఒప్పుకోడు. ఆస్తి కోసమే తన కూతురిని ప్రేమించాడని చెప్పి అవమానిస్తాడు. దీంతో ప్రశాంత్ డబ్బుతో సంతోషం ఉండదని, ఒక్కసారి నష్టపోయి చూడండి. ఆ తర్వాత ఆనందం అంటే ఎంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు.

దీంతో ప్రియా తండ్రి ఒక్కసారైనా బిజినెస్ లో ఓడిపోవాలని, ఓ ఐడియా కోసం పేపర్ ప్రకటన ఇస్తాడు. అందుకు కోటి రూపాయలు బహుమతి కూడా ఇస్తానని చెప్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ప్రియ తండ్రిని కలుస్తాడు. జీవితంలో ఒక్క హిట్ సినిమా కూడా చేయని రోల్డ్ గోల్డ్ రమేష్(రఘుబాబు) డైరెక్టర్గా 30 ఏళ్లుగా జూనియర్ ఆర్టిస్ట్గానే మిగిలిపోయిన వీరబాబు(పృథ్వీ) హీరోగా, సలోని హీరోయిన్గా పెట్టి తమలపాకు అనే పేరుతో సినిమా ప్లాన్ చేస్తాడు. మరి తమలపాకు ప్రియ తండ్రికి నష్టాన్ని మిగిల్చిందా? అసలు సంతోషం అర్థం ఆయనకు తెలిసిందా? ప్రియా, ప్రశాంత్ ప్రేమ ఏమైంది అన్నది మిగిలిన స్టోరీ.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో హీరో నవీన్‌ చంద్రే అయినా సినిమా మొత్తంలో పృథ్వీనే హీరో అయ్యాడు. పేరడీ సీన్స్తో నవ్వించాడు. పంచ్ డైలాగ్స్తో ఆకట్టుకున్నాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాతగా పోసాని కృష్ణమురళి పూర్తి న్యాయం చేశాడు. కామెడీ సీన్స్ బాగున్నాయి. మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ధనరాజ్లు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్:
దర్శకుడు సత్తిబాబు రెండు స్టోరీలను కనెక్ట్ చేసిన తీరు బాగుంది. పేరడీ కామెడీని చాలా బాగా తెరకెక్కించాడు. సెటైరికల్ కామెడీ సీన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు సరిపోయే విధంగా ఉన్నాయి.

పాజిటివ్ : కామెడీ, పృథ్వీ క్యారెక్టర్, దర్శకత్వం
నెగెటివ్ : సెకండ్ హాఫ్, సాగదీత

రిజల్ట్: బాగా సాగదీసినట్టు అనిపించినా.. కడుపుబ్బా నవ్వించిన సినిమా

రేటింగ్: 2.75/5