వర్మ వంగవీటి రివ్యూ

vangaveeti_review

సినిమా : వంగవీటి
నటీనటులు: సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలి, కౌటిల్యా, శ్రీతేజ్
సంగీతం: రవి శంకర్
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్

తెలుగులో తన ఆఖరి సినిమా వంగవీటి.. అని చెప్పిన వర్మ ఈ సినిమాతో తప్పకుండా అందరినీ మెప్పిస్తా అని చెప్పాడు. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో వర్మ తీసిన రక్తచరిత్రలో క్యారెక్టర్ల పేర్లను మార్చి చూపిన వర్మ వంగవీటిలో మాత్రం నిజజీవితంలోని పేర్లతో, 26 ఏళ్ల క్రితం విజయవాడలో చోటు చేసుకున్న యథార్థ ఘటనల ఆధారంగా వంగవీటిని తెరకెక్కించారు. మరి ఇన్ని ప్రత్యేకతలతో తాను మారిపోయిన తర్వాత తీసిన సినిమా అంటూ పెంచిన అంఛనాలను అందుకున్నారా లేదా అన్నది రివ్యూలో చూద్దాం.

వంగవీటి కథ..
ఎర్రపాట్రీ నేతగా చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్గా ఎదుగుతాడు. అదే సమయంలో ఓ చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ వెంకటరత్నం నాయుడి దగ్గర చేరి అతన్ని మించిపోతాడు. రాధ ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం పిలిచి మరీ అవమానిస్తాడు. దాన్ని తట్టుకోలేక పోయిన రాధ వెంకటరత్నాన్ని ప్లాన్ వేసి నరికి చంపేస్తాడు. వెంకటరత్నం మరణం తర్వాత విజయవాడను శాసించే నాయకుడిగా మారిపోతాడు. ఎదురొచ్చిన వారందరినీ అడ్డు తొలిగించుకుంటూ వెళ్తాడు.

మరో వైపు విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవల్లో పార్టీ ప్రమేయం ఉండకూడదంటూ రాధను కోరుతారు. రాధతో పరిచయం అనంతరం అతని మంచితనం చూసి అతనితో కలిసి ఓ పార్టీని తయారు చేసి రాధకు అండగా నిలుస్తారు. రాధ నాయకత్వంలో తమ ఉనికి కోల్పోతోన్న ఎర్రపార్టీ నేతలు రాధను ఒంటరివాడిని చేసి చంపేస్తారు. దీంతో రాధ సోధరుడు రంగా రాధ స్థానంలోకి వస్తాడు. దేవినేని సోదరులు రంగాతో విడిపోయి సొంత పార్టీ పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలోనే రంగా అనుచరులు గాంధీని హత్య చేస్తారు. అన్న మృతితో దేవినేని మురళి ప్రతీకారం కోసం రగిలిపోతాడు. ఆ సమయంలోనే ఓ జాతీయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రంగా గెలుస్తాడు.

ఓ ప్రాంతీయ పార్టీలో చేరి నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. అన్న ఎమ్మెల్యే కావడంతో మురళీకి పగ తీర్చుకునే అవకాశం వస్తుంది. గాంధీని హత్య చేసిన వారందరినీ చంపుతాడు. ఏకంగా రంగా భార్య రత్నకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. మరి మురళీ పగ తీర్చుకున్నాడా? రంగ కథ ఏమైంది? విజయవాడ రాజకీయాలు ఏ మలుపు తీసుకున్నాయన్నది మిగిలిన సినిమా.

నటీనటుల ప్రతిభ…
వంగవీటి రాధ, వంగవీటి రంగా పాత్రల్లో కనిపించిన సందీప్ రౌడీగా, రాజకీయ నాయకుడిగా చాలా బాగా చేశాడు. నైనా గంగూలీ రంగా భార్యగా మెప్పించింది. దేవినేని మురళీ పాత్రలో వంశీ చాగంటి మెప్పించాడు. ఇతర పాత్రలు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ…
యాధార్థ సంఘటనలతో సినిమాలను తెరకెక్కించడం వర్మకు కొత్తేమీ కాదు. కానీ గతంలో వర్మ తీసిన సినిమాలలో మంచి టేకింగ్, టెక్నికల్ వాల్యూస్ ఉండేవి. వర్మ సినిమా అంటేనే ఓ బ్రాండ్ ఉండేది. కానీ ప్రస్తుతం వర్మ తీసే సినిమాల్లో అవేమీ లేవు. వంగవీటిలో అసలు వర్మ మార్క్ కనిపించకపోగా సినిమాను తన వాయిస్ ఓవర్తో నడిపించేశాడు. కథ పక్కన పెట్టి సీన్స్ ను హైలెట్ చేశాడు. నేపథ్య సంగీతం బాగానే ఉన్నా మితిమీరిన రక్తపాతంతో ఓ సారి సినిమా చూడటమే చాలా కష్టం అనిపించేలా ఉంది. డైలాగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఎంతో ఎఫెక్టివ్ గా చెప్పదగ్గ స్టోరీని సోసోగా చూపించాడంతే.

రేటింగ్: 2.5/5